శరీరంలోని అతి ప్రధానమైన హార్మోన్ ఇన్సులిన్. క్లోమగ్రంధి (పాంక్రియాస్)లో ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ గ్లూకోజ్‌ను అనుక్షణం నియంత్రణలో ఉంచే పనిలో ఉంటుంది. అయితే కొందరిలో ఇన్సులిన్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. ఈ స్థితినే మధుమేహం అంటాం. మధుమేహ నియంత్రణలో క్లోమగ్రంధిలోని ఇన్సులిన్ ఉత్పత్తి శక్తిని పెంచేందుకు మాత్రలు సూచిస్తారు. కొద్ది మందిలో ఈ వ్యాధి జీవిత కాలమంతా మాత్రలతోనే నియంత్రణలోనే ఉంటుంది. కానీ, చాలా మందిలో కొంతకాలానికి ఈ మాత్రలు అంత శక్తివంతంగా పనిచేయకుండాపోతాయి. ఈ స్థితి కొంత మందిలో 10 ఏళ్లకే ఏర్పడితే మరికొంత మందిలో 20 ఏళ్లు పట్టవచ్చు. కారణమేదైనా మాత్రలు పనిచేయకుండా పోయినప్పుడు ఇన్సులిన్‌ను ఆశ్రయించక తప్పదు. అయితే ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే దాన్ని ఎప్పటికీ కొనసాగించాలనేమీ కాదు.
ఎన్నెన్ని అపోహలో..
వాస్తవానికి మాత్రలైనా, ఇన్సులిన్ అయినా శరీరాన్ని ఒకే స్థాయిలో ప్రభావితం చేస్తాయి. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అదనంగా నష్టపోయేదేమీ లేదు. ఎప్పుడైనా డాక్టర్ ఇన్సులిన్ తీసుకోవాలని చెప్పినప్పుడు చాలా మంది మొరాయిస్తారు. డాక్టర్ మాటను పక్కన పెట్టి మాత్రలతోనే సరిపెడతారు. ఇలా చేజేతులా ఆరోగ్యాన్ని మరింత పాడు చేసుకుంటారు. ఇన్సులిన్‌ను బయటి నుంచి ఇస్తాం. మాత్రలైనా ఇన్సులిన్‌నే తయారుచేస్తాయి. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌కు అలవాటుపడిపోతుందన్నది కేవలం అపోహ. రోజూ మాత్రలు వేసుకునే వారికి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని సార్లు ఇన్సులిన్ ఇస్తాం.
గ్లూకోజ్ నియంత్రణలోకి రాగానే మళ్లీ మాత్రలనే కొనసాగించమని చెబుతాం. మాత్రలు ఇక ఏమాత్రం పనిచేయక ఇన్సులిన్ దశకు చేరుకున్న వారి పరిస్థితి వేరు. వారింక రోజూ ఇన్సులిన్ తీసుకోవలసిందే. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ బాగా తగ్గిపోతుందనేది (లో-షుగర్) మరో అపోహ. డోసు అవసరానికి మించితే మాత్రలతోనూ షుగర్ తగ్గిపోతుంది. నిజానికి మాత్రల ద్వారా జరిగే తగ్గుదలే ఇన్సులిన్ కన్నా ఎక్కువ ప్రమాదకరమైది. ఇన్సులిన్‌తో తగ్గితే ఆ ప్రభావం 12 గంటలే ఉంటుంది. అదే మాత్రల ద్వారా తగ్గితే 36 నుంచి 48 గంటల దాకా ఉంటుంది. మాత్రలతో అతిగా తగ్గిపోవడం ఒక్కోసారి ప్రమాదకరంగా మారవచ్చు. శరీరంలో ఇన్సులిన్ అసలే ఉత్పత్తి కాని టైప్-1 మధుమేహం ఉన్న వారికి మాత్రం రోజూ ఇన్సులిన్ ఇవ్వడం తప్పదు. మిగతా అందరికీ ఆ అవసరం ఉండదు. మధుమేహం మొదలైన వారికి చాలా వరకు మాత్రలే సరిపోతాయి.
కాకపోతే, కొన్నిసార్లు గ్లూకోజ్ నియంత్రణ తప్పి కొందరికి కాళ్లల్లో పుండ్లు ఏర్పడవచ్చు. ఆ పుండు మానేవరకు కొంత కాలం ఇన్సులిన్ తీసుకోవలసి రావచ్చు. ఆ సమస్య తగ్గిపోతే మళ్లీ మాత్రల్లోకి మారిపోవచ్చు. అలాగే కొన్ని రకాల జబ్బులు ముఖ్యంగా క్షయ లాంటి వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధికి సంబంధించినవే దాదాపు 10 మాత్రల దాకా వేసుకోవలసి రావచ్చు. అలాంటి సమయాల్లో షుగర్ మాత్రలు కూడా వేసుకుంటే ఏ మందులూ పనిచేయకపోవచ్చు. అలాంటి సమయాల్లో మాత్రలకు బదులుగా ఇన్సులిన్ తీసుకోవలసి ఉంటుంది. మధుమేహం కారణంగా రోజూ మాత్రలు వేసుకునే వారికి శస్త్ర చికిత్స అవసరమైనప్పుడు ఇన్సులిన్ తప్పనిసరి అవుతుంది. ఇన్సులిన్ ఇస్తే మూడు నుంచి 6 గంటల్లోనే దాని ప్రభావం ఆగిపోతుంది.
అదే మాత్రలతో అయితే దాని ప్రభావం 36 గంటల దాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఎక్కువ గంటల ప్రభావం ఉన్నప్పుడు గ్లూకోజ్ బాగా తగ్గి కొన్ని సార్లు ప్రమాద స్థితిని చేరుకోవచ్చు. అందుకే శస్త్ర చికిత్సల సమయంలో ఇన్సులిన్ ఇస్తారు. శస్త్ర చికిత్స పూర్తయిన రెండు మూడు రోజుల తరువాత మళ్లీ మాత్రల్లోకి మారిపోవచ్చు. మధుమేహానికి పదేళ్లుగా మాత్రలు వేసుకుంటున్న వారిలో ముఖ్యంగా స్థూలకాయులు, వృద్ధుల్లో కొంత కాలానికి మాత్రలు పనిచేయకుండా పోవచ్చు. అలాంటి వారు ఇక ఇన్సులిన్‌ను ఆశ్రయించక తప్పదు. కొందరిలో మాత్రలు బాగానే పనిచేస్తున్నా, మాత్రల తాలూకు కొన్ని దుష్ప్రభావాలు మొదలవుతాయి. వాటిలో కంటిచూపు తగ్గడం, కి డ్నీలు దెబ్బతినడం, కొన్ని నరాల జబ్బులు (పెరిఫెరల్ న్యూరోపతి), గుండె జబ్బుల్లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ స్థితిలో కూడా మాత్రలనుంచి ఇన్సులిన్‌కు మారవలసి ఉంటుంది.
కృత్రిమ ఇన్సులిన్
చాలా కాలం దాకా జంతువుల నుంచి తీసిన ఇన్సులిన్‌నే మనుషులకు ఇచ్చేవారు. అందులో జంతు సంబంధించిన ప్రొటీన్లు కూడా ఉండడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటూ వచ్చాయి. ఈ కారణంగా కృత్రిమ ఇన్సులిన్ తయారీ మొదలయ్యింది. ఇది ఇప్పుడు అందుబాటులోనే ఉంది. రికాంబినెంట్ డిఎన్ఎ సింథటిక్ ఇన్సులిన్ లేదా మోనో కాంపోనెంట్ ఇన్సులిన్ అనే ఈ ఇన్సులిన్ పూర్తి పరిశుద్ధంగా ఉంటోంది. దీనివల్ల మునుపటి ఆ దుష్ప్రభావాలు కూడా లేకుండా పోయాయి. కొందరికి ఎక్కువ మొత్తంలో అంటే రోజుకు దాదాపు 120 యూనిట్ల దాకా ఇన్సులిన్ అవసరమవుతుంది.
అలాంటి వారికి మాత్రలు సరిపోవు. తప్పనిసరిగా ఇన్సులిన్ తీసుకోవాలి. కాకపోతే ఎక్కువ మంది ఇన్సులిన్ అంటే భయపడేది రోజూ ఇంజెక్షన్ తీసుకోవలసి వస్తుందని, ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల నొప్పి కలుగుతుందని. ఇప్పుడా సమస్య కూడా లేదు. 26 నంబర్ నీడిల్ అనే ఇంజెక్షన్ సూది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. దీనివల్ల అసలు నొప్పే తెలియదు. ఇన్సులిన్ తీసుకోవడం అనేది జీవితపు చిట్టచివరి దశగా భావించడం మరో అపోహ. నిజానికి ఇన్సులిన్ తీసుకోవడం అన్నది ఏ దశలోనైనా ప్రారంభం కావచ్చు. మందులు బాగా పనిచేయనప్పుడు ఇస్సులిన్ సూచిస్తాం. కొన్ని దశాబ్ధాలుగా ఇన్సులిన్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం చివరి దశ ఎలా అవుతుంది? మాత్రలైనా ఇన్సులిన్ అయినా శరీర ధర్మాన్ని అనుసరించి, శరీర అవసరాన్ని బట్టే ఉంటుంది . అంతే తప్ప అవి సమస్య తీవ్రతను చెప్పేవి కావు. అవసరం ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం వివేకం అవుతుందే తప్ప మరొకటి కాదు.
పరిస్థితి కొంత విషమంగా ఉన్న కొంత మంది రోగులకు గంట గంటకూ ఇన్సులిన్ ఇవ్వవలసి ఉంటుంది. అలాంటి వారికి చర్మంలోనే అమర్చి ఉంచే ఇన్సులిన్ పంప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. శరీర అవసరాన్ని బట్టి ఇది మూడు నుంచి ఆరు మాసాల దాకా వస్తుంది. అలాగే సాధారణ మధుమేహుల్లో కూడా కొందరికి ఇన్సులిన్ రోజూ తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి కూడా ఇన్సులిన్ పంప్ బాగా ఉపయోగపడుతుంది. సబ్‌ట్యూటేనియస్ ఇంప్లాంట్ ఇన్సులిన్ పంప్ అనే ఈ పరికరం ఇప్పుడు పెద్ద సౌలభ్యంగా ఉంది.
No comments:
Post a Comment