డయాబెటిస్ అనేది వ్యాధి కాదు డైజెస్టివ్ డిజార్డర్. మనం తీసుకునే ఆహారం జీర్ణమై షుగర్‌గా మారి రక్తంలో కలిసి వివిధ శరీర భాగాలకు చేరుతుంది. అలా దేహంలో కణాలు అన్నింటికీ ఆహారం అందుతుంటుంది. ఒక్కొక్కసారి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రక్తం నిండా గ్లూకోజ్ నిండిపోతుంటుంది. కణాలు ఆహారం లేక ఇబ్బందిపడుతుంటాయి. కణాలు రక్తంలోంచి గ్లూకోజ్‌ను తీసుకోకపోవడం వల్ల రక్తంలో సుగర్ స్థాయి పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని ‘హైపర్ గ్లైసీమియా’ లేక మధుమేహం అంటారు.
డయాబెటిస్ రెండు రకాలు 1. టైప్-1 డయాబెటిస్ 2. టైప్ -2 డయాబెటిస్.. దీనిని ‘డయాబెటిస్ మెల్లిటస్’ అంటారు. మన శరీరంలో ఉత్పత్తి అవుతున్న హార్మోన్స్ ప్రత్యేక విధుల్ని నిర్వహిస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తంలోని షుగర్ కణాల్లోకి వెళ్ళేట్టు చేస్తుంది. సరిపడిన ఇన్సులిన్ శరీరంలో లేకపోతే ఉత్పత్తయిన ఇన్సులిన్‌కి శరీరం స్పందించకపోయినా రక్తంలోని షుగర్ పెరుగుతుంది. డయాబెటిస్ అంటే ఇదే!టైప్ -1 డయాబెటిస్‌లో శరీరంలో చాలా తక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతాయి. లేకపోతే అసలు ఉత్పత్తి కాదు. టైప్-2 డయాబెటిస్ అయితే శరీర కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. శరీరంలో కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. లేకపోతే రెండూ జరుగవచ్చు.
టైప్ -2 డయాబెటిస్‌లో మూత్రం ఎక్కువగా అవుతుంది. దాహం ఎక్కువ. దీనివల్ల ఇబ్బంది కలగకపోయినా భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ రావచ్చు. మూత్ర పిండాల జబ్బులు రావచ్చు, దృష్టి సమస్యలు సంభవించవచ్చు, కాళ్ళు చేతుల్లోంచి నరాలు సరిగ్గా పనిచేయక తిమ్మిర్లు కలుగవచ్చు. ఇది నరాల ఇబ్బంది వల్ల కలుగుతుంది. దీనిని ‘న్యూరోపతి’ అంటారు. రక్తనాళంలో ఇబ్బంది రావచ్చు. దీనిని వాస్యులోపతి అంటారు. సాధారణంగా కాలి వేళ్ళ ప్రాంతంలో ఇది ప్రారంభమవుతుంది. బొటనవేలుకి రక్తప్రసరణ ఆగినప్పుడు అది కుళ్ళిపోవచ్చు. పాదం అంతా వ్యాపించవచ్చు. క్రమంగా మోకాళ్ళ వరకూ... ఆ క్రమం లో తుంటివరకు వ్యాపించవచ్చు. గాంగ్రిన్ వచ్చి కుళ్లిపోయిన అవయవాన్ని ‘యాంపుటేషన్’ ద్వారా శరీరం నుంచి వేరు చేయాల్సి వస్తుంది.
చిన్న రక్తపరీక్ష ద్వారా రక్తంలో షుగర్ స్థాయిని తెలుసుకోవచ్చు. పొద్దున్నే ఏ ఆహారం తీసుకోకుండా రక్తపరీక్షలు జరిపితే ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’ అంటారు. ఆ తరువాత ఏమైనా తిని గంటన్నరకి రక్త పరీక్షలు జరిపితే ‘పోస్ట్ లంచ్’ అంటారు. రోజులో ఏదో ఒక సమయంలో చేసే రక్త పరీక్షను ‘రాండమ్’ రక్తపరీక్ష అని అంటారు. హెచ్‌బి, ఎ, సి రక్తపరీక్ష ద్వారా గత మూడు నెలల్లో బ్లడ్ షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది. డయాబెటిస్‌ని తగ్గించడానికి కొన్ని మందులున్నాయి. అవసరమైతే ఇంజక్షన్ ద్వారా ‘ఇన్సులిన్’ని ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది పరీక్షించిన వైద్యుడు నిర్దేశిస్తాడు. ఒక్కొక్కసారి డయాబెటిస్ వల్ల మరిన్ని ఆరోగ్య ఇబ్బందులూ కలుగకుండా మందులు వాడాల్సి ఉంటుంది.
ఉదాహరణకి రక్తపోటు తగ్గించగలిగే మందుల ద్వారా హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. మందులతో పాటు జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవాలి. కదలికలు లేకుండా ఉండకూడదు. యాక్టివ్‌గా ఉండాలి. బరువు తగ్గాలి. కొవ్వును పెంచే పదార్ధాలు తగ్గిం చాలి. ఇలాంటి అలవాట్లు డయాబెటిస్ అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ‘ఎ,బి,సి’ కంట్రోల్ చేసుకోవాలి. ఎ అంటే ఎ,సి రక్త పరీక్ష. గత మూడు నెలలుగా బ్లడ్ షుగర్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. బి అంటే బ్లడ్ ప్రెజర్. దీనిని అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు ఎక్కువగా ఉంటే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, మూత్రపిండాల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువయితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.
డయాబెటిస్ లేని వాళ్ళకన్నా డయాబెటిస్ ఉన్నవాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశాలు రెండు లేక మూడు రెట్లు ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవాళ్ళకి చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. అది తీవ్రంగా రావచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్ళలో జాగ్రత్తలు పాటించకపోతే మూత్రపిండాల వ్యాధులు త్వరగా రావచ్చు. ఈ రిస్క్ నుంచి కాపాడుకోవాలంటే ‘ఎ,బి,సి’లను అదుపులో ఉంచుకోవాలి తప్పదు. ఎ,సి స్థాయి ఏడుకన్నా తక్కువ ఉండాలి. రక్తపోటు 140/90 దాటరాదు. ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్.. బాడ్ కొలెస్ట్రాల్ 100 కన్నా తక్కువ ఉండాలి.
తాజా పళ్ళు, కూరగాయలు, పప్పు దినుసులు, కొవ్వులేని పదార్ధాలు తినాలి. ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. కనీసం అరగంటైనా నడవాలి. ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఈ విధంగా మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలం. డయాబెటిస్ అదుపులో ఉంటే అంత ఇబ్బంది ఉండదు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్
ఆలివ్ హాస్పిటల్
మెహదీపట్నం, హైదరాబాద్
ఫోన్: 8142961443
No comments:
Post a Comment